రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరాం: బుగ్గన

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు రాలేదని.. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌ రూ.60 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిందనే విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం త్వరితగతిన జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3వేల కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు.